భయాలు, కోరికలు

లలిత శేఖర సంభాషణలు - 2

“ నేను నీకు అస్సల్ ఎందుకు నచ్చానోయ్?” అంటూ బయట ముగ్గేస్తన్న లలితకి వినపడేల అరిచాడు శేఖరం…

లలిత లోపలికి వచ్చి… కూతురికి షూ తొడుగుతున్న శేఖరం పక్కన కూర్చొని… “మీకు గుర్తుందా? మీరు సాహసి పత్రికలో రాసిన ప్రేమలో ఇలా అయితే పడకండీ అనే వ్యాసానికి, మీకు చాలా మంది ఉత్తారాలు రాసారు. ఆ ఉత్తరాలలో నాదీ ఒకటీ. అందులో నా పేరు రాయలేదు. ఆ వ్యాసం ద్వారా, నాకు మీ ఆలోచనా విధానం పరిచయం అయ్యింది. మీలో ఏదో ఉందన్న కుతూహలం ఏర్పడింది. ఆ తర్వాత మీతో స్నేహం మొదలైన కొన్ని రోజులకి, మీరు నాతో మీ అతిపెద్ద భయాలను, మీకు ఆందోళన కల్గించే విషయాలను పంచుకున్నారు. అప్పటినుండే, మీపై ఇష్టం రెట్టింపైంది.“

“నా భయాలు నీకు నచ్చాయా?” అన్నాడు శేఖరం ఆశ్చర్యబోతూ…

“అవునండీ, మీ భయాలే… భయాలు ఎక్కువ కాలం నిలవకపోవచ్చుగాని… ప్రతీ మనిషి భయాలు, ఆందోళనల వెనుక, వాళ్ళ బలమైన కోరికలు, జీవితంలో వాళ్ళు విలువిచ్చే చాలా ముఖ్యమైన అంశాలు దాగుంటాయి… మొదట్లో మీరు మీ వ్యాసలు పత్రికలకు పంపినప్పుడు మీరు చెందిన దిగులు, మీరు రచయిత అవ్వాలన్న మీ సంకల్పాన్ని తెలియజేసింది… అలాగే చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసం, మనోబలం ఉన్న మహిళ మీ జీవిత భాగస్వామిగా దొరుకుతుందో లేదో అన్న మీ భయం వెనకాల ఉన్న మీ బలమైన కోరిక, నేను కోరుకునే నా వ్యక్తిత్వానికి తోడవుతుందే గానీ, హానీ తలపెట్టదు అని అర్ధం అయ్యింది…

అయ్యో అప్పుడే తొమ్మిదైంది… ఆఫీస్కు లేటవుతుంది… దీని గురించి సాయంకాలాన, మళ్ళీ మాట్లాడుకందాం… మీలో నాకు నచ్చిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయండోయ్“ అంటూ గబగబా లేచి గదిలోకి పరుగులు తీసింది లలిత…

– అరవింద్